మోదీ హైదరాబాద్ పర్యటన.. కీలక విషయాలను వెల్లడించిన కిషన్ రెడ్డి
- మే 10న హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోదీ
- రాష్ట్రంలో రూ. 7,823 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్న కిషన్ రెడ్డి
- రూ. 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడి
తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నట్లు ఆయన మీడియాకు తెలియజేశారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారిగా తెలంగాణకు రానుండటంతో... ఈ పర్యటనపై అటు రాజకీయంగా, ఇటు పాలనాపరంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో రైల్వే వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ. 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే, ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణ పనులు కూడా త్వరలోనే పట్టాలెక్కనున్నాయని వెల్లడించారు.
వరంగల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ప్రధాన మంత్రి కాకతీయ టెక్స్‌టైల్ పార్కు'ను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా మంజూరైన ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కుల్లో ఇది ఒకటని చెప్పారు. ఈ పార్కు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, ప్రధాని పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు 3 లక్షల మందిని తరలించాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం భావిస్తోంది.